Manipusalu

 🍃జీవన 🍃
🍃మణిపూసలు🍃

1
అల లాగ  ఎగిసి పడకు
కల లాగ మిగిలి పోకు!
జీవిత ప్రయాణంలో
శిల లాగ ఉండి  పోకు!!

2
స్వార్ధములో చిక్కిపోకు
కోపము లో నలిగిపోకు!
జీవిత ప్రయాణంలో
ఆశగాను ఉండి పోకు!!

3
ధనముతో మునిగిపోకు
బంధాలు తెంచుకోకు!
జీవిత ప్రయణములో
ఒంటరిన బతక బోకు!!


4
బాధలతో ఉండి బోక
కన్నీరును కార్చుబోకు!
జీవిత ప్రయణములో 
మదిలోన క్రుంగి పోకు!!

5
పాపాలే చేయబోకు
కష్టాలనే పడమాకు!
జీవిత ప్రయణములో
ప్రశ్నలనే నిలువబోకు!!

 *అమ్మ*
6
కడుపులో నిన్ను మోసితి
పేగు మోడలో వేసితి!
నొప్పులను చీల్చుతూ
సృష్టిలో దారి చూపితి!!

7
నిన్ను చూసే మురిసితిని
నీ నవ్వుతో నవ్వితిని!
నీ ఆలోచన ఊహల
లో ప్రతి దినం గడిపితిని!!

8
నీకు లాల పోసిన 
నే ఊయ్యాలూపిన!
హాయిగా సేదతీరా 
లనియె జోల పాడిన!!

9
బుజ్జగించి బువ్వపెట్టి
తప్పటడుగులు సరిపెట్టి!
కంటి రెప్పలా చూసిన
ప్రపంచంలో నిలబెట్టి!!

10
నా  ప్రాణమై వెలసితివి
కను రూపమై విరిసితివి!
అంతయు నువ్వే ఆశల-
పంటగానే నిలిచితివి!!

 *డబ్బు మణిపూసలు*

11
డబ్బులే స్వర్గమయే
మనుషులే మాయమయే!
భువిలోన మది లోని
ప్రేమలు లేకపాయే!!

12
ప్రేమలే తరిగాయి
డబ్బులే పెరిగాయి!
మనుసు మధ్యన అడ్డు
గోడలై నిలిచాయి!!

13
మమతలను తుంచాయి
మనుషులను చంపాయి!
మానవత్వాన్ని మరిచి
డబ్బులే నిలిచాయి!!

14
డబ్బు కలత చేసే
మనుసును కలరాసే!
దారము వలేను
బంధము తుంచేసే!!

15
డబ్బులే లేకపాయే
ఆశే చావకపాయే!
పోకడలకే పోయి
జీవితము కృంగిపాయే!!


 *జీవిత మణిపూసలు*

16
పానమునే పోసుకొని
జగతిలోకి చేరుకొని!
జనని జనకుల ప్రేమను 
మదినలోన నిలుపుకొని!!

17
చిరునవ్వులే నవ్వుకొని
స్నేహితులతో ఆడుకొని!
తల్లి కొంగు చాటున
దాగి నడకలు నేర్చుకొని!!

18
జ్ఞానపు గుడిని చేరుకొని
పలక బలపం పట్టుకొని!
గురువు అను నీడలోన
అక్షరాలును దిద్దుకొని!!

19
పుస్తకాలను చదివేసి
సమాజమునే చూసేసి!
మంచి చెడుల మధ్యన
మంచిగానే  నిలిచేసి!!

20
కన్న వాళ్లకు తోడునై
ఆత్మీయులకు  నీడనై!
నా భారతదేశానికి
ప్రతి క్షణము రక్షకునై!!


 *బాల్యము జ్ఞాపకాలు*
21
ఊయల లూగే నా మది
ఉయ్యాల లూగె ఈ మది!
అణుకువగా వున్నాయి
ఇక ఆగేది లేదంది!!


22
అమ్మ చీర చెరుగున
అటాలాడి అలసిన!
నన్ను బడి చేర్చి ముసి
ముసి నవ్వులు నవ్విన!!


23
చిరు నడకలు నేర్పించే
శుభ పలుకులు పలికించే!
పొరపాట్లను సరిచేసి
నిను జగతికి చూపించే!!


24
అరవైలో అమ్మ నాకు
మరి మరి మనసుకు గురుతుకు!
రాగా మది తలుపు తట్టి
పిలిచే పసితనము నాకు!!


25
ఎటు పోతివో బాల్యమా
ఏమైపోతివో ఓ నేస్తమా!
ఒక పారె మరి వస్తావా
నా జీవిత ప్రాణమా!!

*ఆకలి కేకలు*

26
పేద ప్రజల బతుకులు
ప్రజల గుండెల  మంటలు!
కూడు లేక గంజి లేక
కడుపున ఆకలి కేకలు!!


27
తరతరాల వేదన 
యుగయుగాల రోధన!
పిడికెడు మెతుకులకై
దిన దినమున శోధన!!


28
తిండి కై పోరాటాలు 
పుట పుటకు ఆరాటాలు!
మల మల మండే డొక్కలు
ఖాళీ  కడుపుల అరుపులు!!

29
రెక్కలు ముక్కలైన
తనువు అలసిసొలసిన!
ప్రేగులు క్రుంగి క్రుశిం
-చిన సలసల ఎండిన!!


30
పాడి పంటలు పండిన
వ్యవసాయమే ఉండిన!
పొట్ట వెన్నుకంటు కొని 
సన్నగిల్లే వుండిన!!


31
పార్టీలెన్ని వచ్చినా
పాలన తీరు మారునా!
డొక్కలు ఎండిన బతుకులు
మా క్షుద్బాధ తీరునా!!


32
ఇంకా ఆకలి కేకలు   
కడుపున ఎలుకలపరుగులు!
తీరున భారతంనందు
బీదల ఆకలి కేకలు!!

         
*శివుని మణిపూసలు*

33
నుదుట నామాలు పెట్టి
నీ మీద మనుసు పెట్టి!
నిన్ను మదిలో నింపుకొని
కనులతోను కనిపెట్టి!!
34
నీ జాడ వెతికితిని
నీ ప్రతిమ చూసితిని!
నీ సేవ లో మునిగి
నీలోన చేరితిని!!

35
సోమవారము పూజ 
సోమశేఖర పూజ!
విశ్వనికి వెలుగు నింపే
సోమనాథుని  పూజ!!

36
తల్లి లేని వాడవు
ఇల్లు లేని వాడవు!
అమ్మ ప్రేమను ఎరుగక
అనాధగ పెరినావు!!


37
స్మశానమే ఇల్లుయే
ప్రాణాలు బంధమయే!
నీ మనసుకే మూగ 
జీవులే తోడయే!!

38
చర్మమే వస్త్రామాయే
పాములు మెడన నగలయే!
నీ నుదిటి నందున్న
నామమే భస్మమాయే!!


39
నీ రూపము సుందరము
నీ నామము మధురము!
నీ దర్శనము నీ చూపు
మధురాతి మధురము!!

40
నీ చూపులు చల్లనా
నీ పలుకులు తీయనా!
నీ స్మరణే మాకు
ఎల్లప్పుడే ఉండినా!!

41
గరళ కంఠుడవి
గంగను మోసితివి!
రుద్రాక్ష మెడలోన
మాల ధరించితివి!!

42
బిల్వలతో పూజించి
విభూతి ధరించి!
నిష్టాలతో భక్తితో
మనస్సులో సేవించి!!

43
పాపాలు కడిగేసితివి
వరాలు మాకు ఇచ్చితివి!
మా మదిలలో నిలిచి
జీవితములో వెలిసితివి!!

44
లోకమే శివోహం
శివునికి దాసోహం!
ఓ కారము జగత్తు
అంతయు ప్రవాహం!!

45
ఎక్కడన ఉన్నావు శివ
ఏ ప్రాణిన వంటివి శివ!
సందు సందు వెతికిన
ఆత్మనందు నిలుచే శివ!!


46
ఆత్మనందు నిలుచువాడు
ఆకలినే తీర్చువాడు!
కడుపు మంటను తెలిసి
కష్టాలను తీర్చువాడు!!


47
ప్రాణాలు హరించువాడు
ప్రాణాలును పోయువాడు!
సృష్టిలో జనన మరణ
-లకు మూల సూత్రధారుడు!!


48
రూపము లేనివాడు
కోపము లేనివాడు!
రాక్షసులకు సైతం
ప్రేమను పంచువాడు!!


49
అన్నియు నువ్వే శివయ్య
అంతయు నువ్వే శివయ్య!
జగతియందు జనులయందు
మూలము నువ్వే శివయ్య!!

50
చటుక్కున పుటిస్తావు
పుటుక్కున చంపేస్తావు!
బంధాలు అనే మాయ
లోన బంధిచేస్తావు!!

51
ఊపిరి తీసేవాడవు
ప్రాణము పొసేవాడవు!!
కాలగమనం లోనే
కలుపుకునే వాడవు!

52
నీ లీలలు ఆమోఘము
నీ లీలలే అద్భుతము!!
జగత్తు సృష్టిలోనే 
నీ లీలలు ఆనందము!

 *మార్పు మణిపూసలు*

53
మన తరాలు మారినా
మన యుగాలు మారినా!
కడుపున ఆకలి కేకలు 
క్షుద్భాదలు మారునా!!

54
నా దేశముయందునా
ప్రభుత్వాలు మారినా!
పోవునా పేదరికము
పాలనలే మారునా!!

55
పాలన మారదు మారదు
ఇకను ఎన్నడూ మారదు!
జనులు నిలదీసిన నాడు
దేశము మారును మారును!!

56
మనమంతా బానిసలం
నాయకులకి గానుగులం!
రాజకీయ నాయకులని
నిలదీయని పీనుగులం!!

57
అక్షరాలు కదలాలి 
సమాజము ఎదగాలి!
జనుల బ్రతుకులలో
అస్త్రాలుగా నిలువాలి!!

 *దేశము*

58
ఓ యువతరం మారాలి
జగతికి దారి చూపాలి!
ప్రేమ సహనం రెండింటిని
జగతికి మీరు పంచాలి!!

59
మారాలి మారాలి
ఓ యువతరం మారాలి!
దేశ సమైక్యత కోసము
మార్పునే తేవాలి!!

60
భారతీయుల జెండా
ప్రజల గుండెల నిండా!
సైనికుల ఆత్మబలం
మన దేశానికి అండా!! 

61
ఎన్నో కులాల దేశము
ఎన్నో మతాల దేశము!
ఎన్నో జాతులతో
ఏకత్వమైన దేశము!!

62
కదలాలి యువతరం
వెలగాలి మనతరం!
జగతి శ్రేయస్సు కోసం
నిల్వలి భావితరం!!

*జీవితము*

63
కలలా జీవితము కరిగి
శిలలా జీవితము విరిగి!
చీకటిని కలరాసి
జీవితములోనే ఎదిగి!!

64
ప్రపంచానికి కల చూపి
శిలను శిల్పగానే జూపి!
మనుగడకు బాట వేసి
బ్రతుకుకు అర్థాన్ని చూపి!!

65
ఆశయాలను అమలు చేసి
విశ్వానికి దారిని వేసి!
గమ్యము చేరే దిశలో
కష్టాలను ఏ మార్చేసి!!

66
విజయ పథములో నడిచి
గెలుపు గమ్యములో వలచి!
నివ్వు జగతికి ఎగిసి
నీవు ఆదర్శముగా నిలిచి!!

67
మనవుడా చేయగలవు
మనవుడా నెగ్గగలవు!
చరిత్ర పుస్తకాల్లో
సమిథగా నిలువగలవు!!


 *అక్షర మణిపూసలు*

68
పుస్తకాలను చదువుకో
ప్రపంచాని నివ్వు ఎలుకో!
నిన్ను నువ్వే చదివి
జీవితము సరిదిద్దుకో!!

69
అక్షరాలవి ఒంటరే
ఇంకో జతనే కోరే!
అక్షరము కులువగానే
పదాలుగా  మారే!!

70
పదాలు కలిపితే కథలు
అవియె సకల శాస్త్రలు!
జగత్తుకి మూల 'లౌ'
కదిపితే మహాస్త్రలు!!

71
అక్షరము ఒలికించెను
జగతినే పలికించెను!
జగతి శ్రేయస్సు కోరి
నీ/నా కలము తపించెను!!

72
మదిలో ఉరుకులాట
తనువే ప్రాకులాట!
సమాజ శ్రేయస్సు కై
అక్షరము వెతుకులాట!!

73
కత్తి పదును క్షణికము
కలము పదును తదేకము!
కత్తి కే  ఆవేశము
కలమునకే వివేకము!!

74
రాతకు శక్తి  అఖండము
రాతకు మాట అఖండము!
జగత్తుకి రాత మార్గం
భాషకు రాత అఖండము!!

 *చెలి మణిపూసలు*

75
నా కనులకే చూపువై
నా ఉపిరికి శ్వాసవై!
నా హృదయస్పందనై
నా పెదువు పై చిరునవై!!

76
నా  ఊహాలకు ఆశలు 
నా మదిలోన భాషాలు!
నీతో కలిసిన క్షణాలు 
చేరుగని జ్ఞాపకాలు!!

77
నా జీవితమున భాగము
నా జీవితమున మార్గము!
నీతో మాటలు నడకలు 
జీవితమనే పాఠాలు!!

78
ప్రాణము ముగుసిన చెరగదు
నిన్ను ఎప్పుడును వదలదు!
నా ప్రేమ సామ్రాజ్యం 
ఎన్నటికి నిన్ను  మరవదు!!

79
బ్రతకలేని చావును
బ్రతుకించే మందును!
బ్రతుకు అర్థానిచ్చే
ప్రేమ కావ్యాన్ని నేను!!

 80
మాటరాని మౌనము
విడలేని గానము!
చెలి తోడు లేక
నిలవలేదు పానము!!

81
నితో తొలి పరిచయము
ని తోడే ఆనందము!
నిన్ను చూసి మౌనం
విడలేని అనుబంధము!!

82
మనసులోకి వస్తావు
మాటలు మర్పిస్తావు!
కనులలోకి వచ్చేసి
కలము చేతిపేస్తావు!!

83
నీతోనే ఉంటాను
నీకై ఎదురు చూస్తాను!
ప్రతి క్షణము ఆలోచన
-లతో గడిపేస్తాను!!


 *జవాన్ మణిపూసలు*


84
పుడమి తల్లికే చినుకువు
ప్రకృతి ఒడిలో బిడ్డవు!
మంచు కొండలో నిలిచిన 
భారతభూమి జవానువు!!

85
కళ్ళకు కునుకు లేదు
తనువును అలుపు లేదు!
భారతభూమి పోరు
-లో మరణమే లేదు!!

86
తూటాకు ఎదురు నిలిచే
పడమికి అండై నిలిచే!
భారతభూమి ముద్దు
బిడ్డది త్యాగము నిలిచే!!


*కథ మణిపూసలు*

87
గుప్పెడంత పిట్టను
గూడు కట్టదాల్చను!
కష్టించి కాళ్లు ముక్కు
తో  చేస్తా గూడును!!

88
గూడు పెట్టాలనుకునే
అల్లాటప్ప కాదనే!
చూస్తేనే ముచ్చట
గాను అనిపించాలనే!!

89
అందంగా ఉండాలి
హాయిగాను నిలవాలి!
ఆడ గిజిగాడు రెక్కలు 
కట్టు వాలిపోవాలి!!

90
గడ్డి పోచలు  తెచ్చెను
తుమ్మకు ముడి వేసేను!
తన ముక్కుతో పాటు
కాళ్లకి పని చెప్పేను!!

91
పిచ్చుక గూడు అల్లెను
సుందరంగా చేసేను!
గజిబిజి అల్లికలతో
రెండెసి గదులు కట్టెను!!

92
ఆడ గిజిగాడు వచ్చెను
గూడు అంతనే తిరిగెను!
మగ గిజిగాడు పనితనం
చూసి మదిలో మురిసెను!!

93
రెండు కాపురం చేసెను
మూడు గుడ్లు పెట్టెను!
ఆడ గిజిగాడు కై మగ 
గిజిగాడు తిండి తెచ్చెను!!

94
మూడు గుడ్లను పొదిగాయి
గుడ్లే  పిల్లలయ్యాయి!
గూటి నుండి రెక్కలొచ్చి
పిల్లలు ఎగిరిపోయాయి!!

95
పిల్లలు లేని గూట్లోను
మనమెందుకు అనుకునేను!
పెద్ద గిజిగాళ్ళూ ఇద్దరు
గాల్లోకి తుర్రుమనేను!!

96
గిజిగాడి గూడును చూడు
నిర్మించిన తీరు చూడు!
ఇంజినీర్ ను అబ్బురపరి
-చే కట్టిన తీరు చూడు!!

 *పొడుపు కథ మణిపూసలు*

97
కానరాని విత్తనము
ఘనమైనట్టి వృక్షము!
ఊరు చివర ఉండును
ఊయలలూగే వృక్షము!!
(మర్రి చెట్టు)


98
చిట్టడవిలో చిన్నది
షికారే చేస్తున్నది!
కానరాని అడవిలో
కర్రావు మేస్తున్నది!!
(పేను)


99
చూపులేనిది  కన్నులు 
సుందరమైన కన్నులు!
కన్నులు గాని కన్ను
కాలకంఠుని కన్నులు!!

(నెమలి)

Comments